చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోండి ..ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోండి ..ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జి. చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. శుక్రవారం చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ చీఫ్‌‌‌‌ మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి రాతపూర్వకంగా కంప్లైంట్‌‌‌‌ ఇచ్చారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌‌‌‌ చేయాలని ఖర్గేను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

కేబినెట్‌‌‌‌ హోదాతో ప్రణాళికా సంఘం వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి ఇచ్చి గౌరవించినా.. డబ్బులు ఇస్తేనే పార్టీలో సీటు ఇస్తారంటూ చిన్నారెడ్డి మాట్లాడారని ఆరోపించారు. భేటీ తర్వాత మేఘారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వాయిస్‌‌‌‌ రికార్డులు, మీడియా క్లిప్పింగులను ఖర్గేకు అందజేశామని తెలిపారు. ఖర్గే సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌‌‌, తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ మీనాక్షి నటరాజన్‌‌‌‌ను కూడా కలుస్తామని వెల్లడించారు. మేఘారెడ్డితో పాటు వనపర్తి నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాల కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షులు ఉన్నారు.